పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0298-01 దేవగాంధారి సం: 03-566 వైరాగ్య చింత

పల్లవి:

మాయామోహము మాన దిది
శ్రీయచ్యుత నీ చిత్తమే కలది

చ. 1:

యెంత వెలుఁగునకు నంతే చీఁకటి
యెంత సంపదకు నంతాపద
అంతటా నౌషధ మపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది

చ. 2:

చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మభోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆసల మిగిలిన దలపే కలది

చ. 3:

మొలచిన దేహము ముదియుటకును సరి
దలఁచిన దైవము తనలోను
యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ-
గలిగిన మాకెల్ల ఘనతే కలది