పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0165-05 నాదరామక్రియ సం: 02-316 వేంకటగానం

పల్లవి:

పరులకైతే నిదే పాపము గాదా
పురిగొని నీవంకఁ బుణ్యమాయఁ గాక

చ. 1:

పరమపురుష నీవు పట్టినదే ధర్మము
అరసి నీవు చెల్లించినదే సత్యము
ధరలోన నీరెంటికి తండ్రితో విరోధించఁగ
దొరసి ప్రహ్లాదునకు దోడైనదే గురుతు

చ. 2:

నారాయణుఁడ నీవు నడిపినదే తగవు
ఆరూఢి నీ వౌన్ననదే ఆచారము
సారెకుఁ దమయన్నతో చండిపడి పెనగఁగ
కోరి సుగ్రీవు వహించుకొన్నదే గురుతు

చ. 3:

శ్రీవేంకటేశ నీవు చేసినదే నీతి
చేవతో నీ వొడఁబరచినదే మాట
కావించి తాతతోఁ బోరఁగా నీవు చక్రమెత్తి
ఆవేళ నడ్డమైనందుకు అర్జునుఁడే గురుతు