పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0165-04 నాదరామక్రియ సం: 02-315 దశావతారములు

పల్లవి:

ఎంతకత నడిపితి వేమి జోలిఁ బెట్టితివి
చింతించ లోకములు నీచేతివే కావా

చ. 1:

కౌరవులఁ బాండవుల కలహము వెట్టనేల
నేరచి సారథ్యము నెఱపనేలా
కోరి భూభార మణఁచేకొరకై తే నీచే చక్ర-
మూరకే వేసితే దుష్టు లొక్కమాటే తెగరా

చ. 2:

చేకొని వానరులఁగాఁ జేయనేల దేవతల
జోకతో లంకాపురి చుట్టుకోనేల
కాకాసురు వేసిన కసవే రావణుమీఁద-
నాకడఁ జంపువెట్టితే నప్పుడే సమయఁడా

చ. 3:

గక్కన శ్రీవేంకటేశ కంబములో వెళ్లనేల
చొక్కముగాఁ బ్రహ్లాదుఁడు చూపఁగనేల
చిక్కక హిరణ్యకశిపునాత్మలో నుండక
తక్కించి నీవెడసితే తానే పొలియఁడా