పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0295-04 కన్నడగౌళ సం: 03-551 మాయ

పల్లవి:

దైవమా నీవే యిందు దయ దలఁచుటఁ గాక
తోవనున్న జీవులెట్లు తోసేరు నీమాయ

చ. 1:

పలుచవులందునెల్ల ప్రాణమే మిక్కిలి చవి
బలిమి తీపులలోనఁ బ్రాణమే తీపు
యిలపైఁ బూజ్యులలోన నింతులే కడుఁబూజ్యులు
తలఁచి జీవులు యెట్టు దాఁటేరు నీమాయ

చ. 2:

తగు చుట్టరికాలలో ధనమే చుట్టరికము
జగతిఁ గట్టని కట్టు సంసారము
వగలైన గుణాలలో వైరమే నిజగుణము
జిగిఁ బ్రాణులెట్లు గెలిచేరు నీమాయ

చ. 3:

తమలో నెవ్వరికైనా తమ జాతి తమ నేర్పు
తమకు నెక్కుడై తోఁచు తక్కువనరు
నెమకి శ్రీవేంకటేశ నీదాసులకే కాని
భ్రమసిన జీవులెల్లాఁ బాయరు నీమాయ