పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0295-05 లలిత సం: 03-552 విష్ణు కీర్తనం

పల్లవి:

తెలిసినవారి కింతా దేవుఁడై యుండు
కలఁడన్నచోట హరి గలఁ డటుగాన

చ. 1:

అందునిందుఁ బోయి శ్రీహరిని వెదకనేల
బొందితోడి రూపులెల్లాఁ బొరి నతఁడే
కొందరిలోనుండి ఇచ్చుఁ గోరినట్టి యీవులెల్ల
కొందరిలో మాటలాడుఁ గొందరిలో నగును

చ. 2:

లోన వెలిఁ జూచి పరలోకము వెదకనేల
యేనెలవైన వైకుంఠ మెదుట నదె
పూని వొకచోట నెండ పొడచూపు నక్కడవే
నానిన వెన్నెల గాసు నానారీతులౌను

చ. 3:

చొక్కిచొక్కి యానందసుఖము వెదకనేల
మక్కువఁ దా శాంతుఁడైతే మతిలో నదె
యెక్కువతో శ్రీవేంకటేశ్వరు దాఁసుడ నైతి
వొక్కఁడే మాకిన్నిటికిఁ నొడయఁడై నిలిచె