పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0295-03 బౌళి సం: 03-550 అద్వైతము

పల్లవి:

పుట్టుగులు నొక్కటే పుణ్యపాపములే వేరు
యెట్టుసేసినాఁ జేసీ నేమి సేయవచ్చును

చ. 1:

పగలే రేయి యీబడిఁ గొన్నిజీవులకు
వొగి నా రేయి పగలౌ నొకరికిని
తగుదైవ మొకఁడే తమ మతములే వేరు
పగటుల విష్ణుమాయ భ్రమయించీ నిదివో

చ. 2:

నిలువెల్లాఁ జేఁదే నెరిఁ గొన్నివృక్షములు
కలదెల్లఁ దీపే కమ్మరఁ గొన్ని
తలఁపును నొకటే తత్త్వములే వేరువేరు
చెలరేఁగి విష్ణుమాయ చిక్కువెట్టీ నిదివో

చ. 3:

ఇహమే పరము యెరిఁగితేఁ గొందరికి
మహిఁ బరమే ఇహము మరొకరికి
వహితో శ్రీవేంకటేశు వలెనని కొలిచితే
సహజపు విష్ణుమాయ జారిపోవునపుడే