పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0295-02 సామంతం సం: 03-549 అధ్యాత్మ

పల్లవి:

గోవిందుదాసులమై కొన కెక్కుదుముఁ గాక
వేవేలు విధుల నమ్మి వెతఁబడఁగలమా

చ. 1:

మనసు లోపలి మామర్మము దెలియలేము
ఘనుఁడైన హరి నెట్టు గానఁగలము
తనువుతో భోగాలు తగులు వీఁడగలేము
వెనక కర్మపాశాలు వీడించుకోఁగలమా

చ. 2:

వడిఁ బెట్టే యింద్రియాల వద్దని మానుపలేము
తొడరి సంసారము తోయఁగలమా
బడిబడి నానాటి బతుకు చెప్పుకోలేము
పొడలేటి యితరుల బోధించఁగలమా

చ. 3:

కొంకక ఆడిన మాట గురుతు వెట్టఁగలేము
లంకె వేదవాక్యము దలఁచఁగలమా
యింకా శ్రీవేంకటేశుఁ డితఁడే మా దేవుఁడని
సంకెలేకుందుముఁ గాక జాలిఁబడఁగలమా