పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0295-01 తెలుగు కాంభోధి సం: 03-548 గురు వందన, నృసింహ

పల్లవి:

ఇందునే తుదిపద మెక్కి రిందరును
మందరధర నీ మహిమిదివో

చ. 1:

మరిగిన పుణ్యుల మతిలో కోరిక
పరమపు హరి నీ పాదములు
గరిమ గోపికలు గావలెనన్నది
హరి నీ సంభోగ మదియెపో

చ. 2:

పొంచి వేదములు పొగడెడి యర్థము
అంచెల గుణకథ లవి నీవి
పంచి యజ్ఞముల ఫలమై యున్నవి
నించి దేవ నీ నిజపూజలెపో

చ. 3:

కైవల్యమునకుఁ గడుఁ దెరువై నది
ఆవల నీ శరణాగతియే
శ్రీవేంకటేశ్వర చెప్పె మా గురుడు
మావద్ద నిదె నీ మంత్రమెపో