పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0294-06 గుండక్రియ సం: 03-547 శరణాగతి

పల్లవి:

ఎట్టొకో దైవమా ఇదె నీకు శరణంటి
తొట్టిన నా బ్రదుకుకుఁ దుదయు లేదు

చ. 1:

నాని యీజన్మమెత్తి నాటివెల్లా మఱచితి
పూని యేమిటా విరతి పుట్టనేరదు
కానను ముందర వచ్చే ఘనకర్మపాశములు
పానిపట్టి(?)యించుకంతా భయమూలేదు

చ. 2:

పంచేంద్రియములఁ జిక్కి భావమెల్లాఁ జిక్కువడె
అంచెల మోక్షముతోవ అరయలేను
యెంచి నాదేహములోని హేయమును సాత్మించె
చంచలపు దుర్గుణాలు చక్కనైనాఁ గావు

చ. 3:

నగు సంపదల చేత నన్ను నేనే మరచితి
తెగువది వివేకించఁ దీరదెప్పుడు
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలఁగాను
జగమెల్లా నెరఁగ నే సాత్వికుఁడనైతి