పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0294-05 లలిత సం: 03-546 విష్ణు కీర్తనం

పల్లవి:

వింటిమి నీ కతలు కంటిమి నీమాయలు
బంటుల మచ్యుత నీ పాలివారమయ్యా

చ. 1:

కలిగిరి నీవల్లనే కడఁగి బ్రహ్మాదులు
నిలిచిరి సురలెల్లా నీవల్లనే
తెలిసిరి మునులెల్లా దేవుఁడవు నీవేయని
చలపట్టి హరి నీకు శరణనేమయ్యా

చ. 2:

నుతియించీ వేదములు నోరార నీ మహిమ
గతియాయ వైకుంఠమే ఘనులకెల్లా
ప్రతిలేని నీ రూపే భావించేరు యోగీంద్రులు
తతితో శ్రీపతి నీకే దాసులమయ్యా

చ. 3:

అదె నీ చక్రముచేత నడఁగి రసురలెల్లా
బదికిరి విప్రులు నీపాద సేవను
పొదలి శ్రీవేంకటేశ పొంది నీ కరుణ చేత
మొదల వెనక నీకే మొక్కేమయ్యా