పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0209-05 గుండక్రియ సం: 03-053 అద్వైతము

పల్లవి:

నీయంతవారు గారు నిండుసామర్థ్యము లేదు
యీ యహంకారపు ముక్తి యీడేరీనా తమకు

చ. 1:

నీ సేవలే సేసి నీ కృప రక్షించఁగాను
ఆసలఁ బొందే ముక్తి అది చాలక
నీ సరివారలై నీవే తామనుకొని
యీసులఁ బొందే ముక్తి యీడేరీనా తమకు

చ. 2:

పొంచిన రాక్షసులెల్ల పూర్వదేవతలమంటా
యెంచుక పట్టిన మదమీ గర్వము
అంచెలఁ గర్మమే సేసే రాయాదేవతలఁ గూర్చి
ఇంచుకంతలోనే ముక్తి యీడేరీనా తమకు

చ. 3:

హరిలాంఛనపు భక్తి కందుకు నొడఁబడరు
సరిరోగికిఁ బథ్యము చవిగానట్టు
గరిమ శ్రీవేంకటేశుఁ గని మననివారికి
యెరవులనే ముక్తి యీడేరీనా తమకు