పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0209-04 లలిత సం: 03-052 అద్వైతము

పల్లవి:

అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు
యియ్యెడ నెట్టుగలిగె నీ యసురమతము

చ. 1:

నీ ముద్రలూ నొల్లరు నీదాసోహము నొల్లరు
కామించి నీ మీఁది భక్తి కడు నొల్లరు
నామమంత్రము నొల్ల రనామయుండ వనెందురు
తాము వైష్ణవుల మంటాఁ దర్కింతురు

చ. 2:

పైతృకవేళ నీపస్రాదమూ నొల్లరు
ఘాతల నూర్ద్వపుండ్రము గాదందురు
జాతర దైవాల నిన్ను సరిగాఁ బూజింతురు
ఆతల వైష్ణవులు దామనుకొందురు

చ. 3:

శ్రీవైష్ణవులఁ గంటేఁ జేతులెత్తి మొక్కరు
భావింతురు పగవారిఁబలెఁ గన్నట్టు
ఆవల వైకుంఠమూ ననిత్యమందురు
కావించి వైష్ణవులము కామా నేమందురు

చ. 4:

వరుస రావణాదుల వలె నెజ్ఞాలు సేతురు
సరుస నట్టే వేదమూఁ జదువుదురు
నిరతి శ్రీవేంకటేశ నీ మహిమ లెరఁగక
అరిది వైష్ణవులమే యని యాడుకొందురు