పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0209-03 ముఖారి సం: 03-051 శరణాగతి

పల్లవి:

నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు
దైవమా సిగ్గువడక తగిలేనేఁ గాకా

చ. 1:

చెంది నీకు బ్రహ్మాదులు సేవలు సేయఁగాను
యిందు మా సేవలు నీకు నేడకువచ్చు
పొంది వసిష్ఠాదు లట్టే పూజలు సేయఁగాను
సందడి మాపూజలు సరకా నీకు

చ. 2:

సనకాదియోగులు సారె నిన్నుఁ దలఁచఁగా
యెనసి మాతలఁపు నీ కేడకెక్కును
నునుపుగా శేషాదులు నుతులు నిన్నుఁ జేయఁగా
పనివడి మా నుతులు బాఁతేయనా నీకు

చ. 3:

కిట్టి నారదాదులు నీకింకరులై వుండఁగాను
యిట్టె నీదాసుఁడ ననుటెంత కెంత
వొట్టి శ్రీవేంకటేశ మాకొకవుపాయము గద్దు
పట్టి నీదాసుల బంటుబంట నయ్యేనిఁకను