పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0292-04 వసంతవరాళి సం: 03-533 వేంకటగానం

పల్లవి:

అతని నమ్మలే రల్పమతులు భువి
నతఁ డాద్యుఁడు పరమాత్ముఁడు

చ. 1:

సకలలోకపతి సర్వేశ్వరుఁడట
వొకఁడిఁక దొర మరి వున్నాఁడా
ప్రకటించఁగ శ్రీపతియే దాతట
వెకలి నియ్యఁగొన వేరే కలరా

చ. 2:

దివిజవందితుఁడు దిక్కుల హరియట
యివల మొక్క సురలిఁక వేరీ
కవ నంతర్యామి కరుణాకరుఁడట
వివిధభంగులను వెదకఁగనేలా

చ. 3:

వేదాంగుఁడు శ్రీవేంకటపతి యట
ఆదిమతము లిఁక నరసేదా
యేదెస నెవ్వరి కెప్పుడుఁ గలఁ డితఁ-
డీదేవుఁడె మన కిహపర మొసఁగ