పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0292-05 సాళంగనాట సం: 03-534 శరణాగతి

పల్లవి:

ఒకరిఁ గానఁగ నొడఁబడదు మనసు
సకలము హరియని సరిఁదోఁచీని

చ. 1:

అంతరాత్మ శ్రీహరి యతఁ డొకఁడే
జంతువులన్నియు సమములే
బంతులఁ బాత్రాపాత్రము వెదకిన
అంతట హరి దాస్యమేపో ఘనము

చ. 2:

జగమును నొకటే చైతన్య మొకటే
తగిన పంచభూతము లొకటే
నగుతా నెదిరిని నన్నును నెంచిన
మొగి నాపై హరి ముద్రలె ఘనము

చ. 3:

కారు స్వతంత్రులు కడపట నొకరును
యీరీతి నౌఁగాము లిఁక నేలా
శ్రీరమణీపతి శ్రీవేంకటేశుఁడే
కారణము శరణాగతియే ఘనము