పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0292-03 దేసాక్షి సం: 03-532 శరణాగతి

పల్లవి:

దేవుఁ డొక్కఁడే మాకు దిక్కుగాని
కావ నెవ్వరును లేరు కతలింతే కాని

చ. 1:

పచ్చివొళ్లు మోచితిమి పాపమెల్లాఁ జేసితిమి
హెచ్చిన మీఁదటి సుద్దు లేఁటివో కాని
రచ్చలఁబడె మా గుట్టు రమణుల చేఁత బెట్టు
అచ్చమై యిందుకుఁ బరిహరమేదో కాని

చ. 2:

గాలిమూఁటఁ జిక్కితిమి కన్నచోటే తొక్కితిమి
ఆలించి యేమిటివారమయ్యేమో కాని
మైల గొంత మనసూ మణుఁగు గొంతానాయ
తాలిమి నా విధి యేమి దలఁచీనో కాని

చ. 3:

మాయలఁ బొరలితిమి మరచితి మింతలోనే
చాయల శ్రీవేంకటేశు శరణంటిమి
రోయఁజొచ్చె జగమెల్లా రుచియాయ వైరాగ్య-
మాయము నాలోపలి అంతరాత్మేకాని