పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0289-05 సాళంగనాట సం: 03-516 రామ

పల్లవి:

సీతాసమేత రామ శ్రీరామ
రాతి నాతిఁ జేసిన శ్రీరామ రామ

చ. 1:

ఆదిత్యకులమునందు నవతరించిన రామ
కోదండభంజన రఘుకుల రామ
ఆదరించి విశ్వామిత్రుయాగము గాచిన రామ
వేదవేదాంతములలో వెలసిన రామ

చ. 2:

బలిమి సుగ్రీవుని పాలి నిధానమ రామ
యిల మునుల కభయమిచ్చిన రామ
జలధి నమ్ముమొనను సాధించిన రామ
అలరు రావణదర్పహరణ రామ

చ. 3:

లాలించి విభీషణుని లంక యేలించిన రామ
చాలి శరణాగతరక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రిమీఁద వెలసిన రామ
తాలిమితో వెలయు ప్రతాపపు రామ