పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0289-06 దేసాళం సం: 03-517 దశావతారములు

పల్లవి:

కోనేటి దరులఁ గనుఁగొనరో మూఁడుదేరులు
నానాదేవతలార నరులార మీరు

చ. 1:

తెంకిగా ముందర నొక్క తేరెక్కె శ్రీకృష్ణుఁడు
వేంకటేశుఁ డెక్కె నదె వేరొక్క తేరు
లంకెలై శ్రీభూసతులు లలి నొక్క తేరెక్కిరి
కొంకక వీధుల నడగొండలో యనఁగను

చ. 2:

యిరవై శ్రీకృష్ణునిది యిదె వానరధ్వజము
గరుడధ్వజము శ్రీవేంకటపతిది
కరిలాంఛన ధ్వజము కమలకు మేదినికి
అలరి చూపట్టెను బ్రహ్మాండాల వలెను

చ. 3:

చెలఁగి చెఱకువిల్లు చేతఁబట్టె శ్రీకృష్ణుఁడు
బలు శ్రీవేంకటేశుఁడు పట్టెఁ జక్రము
అలమేలుమంగ భూమి యంబుజాలు చేఁబట్టిరి
కలసి మెలసేరు బంగారుమేడ లనఁగ