పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0289-04 వరాళి సం: 03-515 దేవుడు-జీవుడు

పల్లవి:

దేవుఁడవు నీవు జీవులు నీ బంట్లు
చేవదేరి నీ సేఁతే శేఖరమై నిలిచె

చ. 1:

చేరి నేరమి సేసేది జీవునికి స్వభావము
నేరిచి రక్షించేది నీ స్వభావము
ధారుణి లోపల మరి తప్పులెంచఁ జోటేది
మేర మీరి నీ మహిమే మిక్కుటమై నిలిచె

చ. 2:

మత్తుఁడై వుండేదే మనుజుని స్వభావము
నిత్తెపుజ్ఞాన మిచ్చేది నీ స్వభావము
వొత్తి గుణావగుణాలు వొరయఁగఁ జోటేది
సత్తుగా నీ కరుణే సతమయి నిలిచె

చ. 3:

చెలఁగి నీ శరణు చొచ్చేదే నా స్వభావము
నెలవై యేలుకొనేది నీ స్వభావము
మలసి శ్రీవేంకటేశ మనసు సోదించ నేది
చలిమి బలిమిని నీస్వతంత్రమే నిలిచె