పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0284-04 శుద్ధవసంతం సం: 03-485 కృష్ణ


పల్లవి :

చేరి యశోదకు శిశు వితఁడు
ధారుణి బ్రహ్మకు దండ్రియు నితఁడు


చ. 1:

సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడు లక్ష్మణుఁడు
నిలిచిన నిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితఁడు


చ. 2:

మాటలాడినను మరి యజాండములు
కోటులు వొడమేటి గుణ రాశి
నీటగు నూర్పుల నిఖిలవేదములు
చాటువ నూ రేటి సముద్ర మితఁడు


చ. 3:

ముంగిటఁ బొలసిన మోహన మాత్మలఁ
బొంగించే ఘనపురుషుఁడు
సంగతి మా వంటి శరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపుఁ డితఁడు