పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0284-03 భూపాళం 03-484 ధనుర్మాసం


పల్లవి :

ఏమి నిద్దిరించేవు యెందాఁకాను
కామించి బ్రహ్మాదులెల్లఁ గాచుకున్నా రిదివో


చ. 1:

పులుఁగాలుఁ బచ్చళ్ళు బోనము పెట్టినదిదే
వెలయు ధనుర్మాస వేళయు నిదే
బలసి సంకీర్తనపరులు పాడేరిదే
జలజాక్షుఁడ లేచి జలక మాడవయ్యా


చ. 2:

తోడనే గంధాక్షతలు ధూపదీపా లివిగో
కూడిన విప్రుల వేద ఘోషణ లివే
వాడుదేరఁ బూజించవలెఁ గమ్మఁబువ్వులివె
వీడెమిదె కొలువుకు విచ్చేయవయ్యా


చ. 3:

చదివేరు వైష్ణవులు సారెఁ దిరువాము డిదె
కదిసి శ్రీసతి ముందే కాచుకున్నది.
అదనాయ శ్రీవేంకటాధిప మా చరపిదే
యెదుట నిన్నటిమాపే యియ్యకొంటివయ్యా