పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0284-05 సాళంగం సం: 03-486 వైష్ణవ భక్తి


పల్లవి :

జీవన్ముక్తులము శ్రీపతి దాసులము
భావించవో మమ్మును ప్రపంచపు మాయా


చ. 1:

యివల దానధర్మము లేమిఁ జేయుట లేదు
తవిలిన పాతకాలు దైవమే వహించుకొనె
భువిలోన నా కిఁక బుట్టఁబని లేదు లేదు.
భవరోగవైద్యుఁడు శ్రీపతి గలఁడు గాన


చ. 2:

యెలమి స్వర్గాది లోకాలేమీఁ గోరుట లేదు
కల వైకుంఠము హరి కాలమునాఁడే యిచ్చె
తొలుత నాకుఁ జావుల తోడి సడ్డ వద్దు వద్దు
బలువైన యచ్యుతుని బంట్లము గాన


చ. 3:

పూపసుఖమూ నొల్లము పొంచి దుఃఖమూ నొల్లము
చేపట్టి బ్రహ్మానందము శ్రీవేంకటేశుఁ డిచ్చెను
దూపయు నాఁకటికిఁగా తోదోపు మా కిఁక వద్దు
కాఁపమృతమథనుఁడు గలఁ డిట్టే కాన