పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0280-03 దేసాళం సం: 03-41 జోల


పల్లవి :

జోజో యని మీరు జోల వాడరో
సాజపు జయంతి నేడే సఫల మిందరికి


చ. 1:

అదె చంద్రోదయమాయ హరి యవతారమందె
మొదల జాతకర్మములు సేయరో
అదన పుత్రోత్సవమట పుణ్యాహము చేసి
కదిసి యిట్టె నామకరణముఁ జేయరో


చ. 2:

కాయము దేవకికిచ్చి గక్కన వాసుదేవుని-
కీయరో గంధాక్షత లిటు విడేలు
కాయకపు గాడిదెకు కవణము పెట్టి మరి
వీయపు చుట్టాలెల్ల వీడు వెట్టరో


చ. 3:

షోడశోపచారములఁ జొక్కించి శ్రీవేంకటేశుఁ
బాడరో ధర్మము నిల్పె భార మణఁచె
వోడించెఁ గౌరవదానవులఁ గంసాదులఁ జంపె
ఆడనే పాండవులఁ గాచెనని యర్ఘ్యమియ్యరో