పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0280-02 లలిత సం: 03-460 వైష్ణవ భక్తి


పల్లవి :

ఎక్కడి పుట్టుగ లిఁక నెక్కడి మరణములు
మిక్కిలి నీ ముద్రలు నా మేననున్న వివిగో


చ. 1:

కెరల పాపములకుఁ గెరల కర్మములకు
హరి నీ నామము నోరనంటితేఁ జాలు
నరకములేమి సేసు నా నేరమేమిసేసు
నిరతి నా మతిలోన నీ వుండఁగాను


చ. 2:

చిక్క నింద్రియములకు చిక్కను బంధములకు
చొక్కి హరి నీ మఱఁగు చొచ్చితిఁ జాలు
మొక్కనేలే యెవ్వరికి మొరవెట్ట నేమిటీకి
నిక్కపు మా యిలువేల్పు నీవై వుండఁగా


చ. 3:

దగ్గరవు మాయలింక దగ్గరవు దుర్గుణాలు
నిగ్గుల శ్రీవేంకటేశ నీవు గల్గఁగా
యెగ్గులేదు తగ్గులేదు యిఁక నీదాసులలోన
వుగ్గువలె నీప్రసాద మూనినది వొడల