పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0279-05 బౌళి సం: 03-457 శరణాగతి


పల్లవి :

వేళ లేదు జాడ లేదు వీని తోడిదే పాటు
కూళఁడనై తిరిగేను గుణమేది నాకు


చ. 1:

వేగిరించి పెరరేఁచి వేసరించీఁ బనులు
సాగి ముందరఁ బొలసి చలపట్టీ సిరులు
జాగు సేసి వచ్చి వచ్చి చవి చూపీఁ బాయము
యేగతి నిన్నుఁ దలఁతు నేది బుద్ధి నాకు


చ. 2:

తన్నుఁదానే వచ్చి వచ్చి తగిలీ లంపటము
వున్నతి భోగముల నోరూరించీ సుఖము
కన్నచోనే యెలయించి కదిమీ సంసారము
యెన్నఁడు నిన్నుఁ దలఁతు నెఱుకేది నాకు


చ. 3:

తాలిమితో మీఁద మీఁదఁ దరవయ్యీఁ గర్మము
నాలితోడ సన్నసేనీ నవ్వు నవ్వి మర్మము
యేలితివి శ్రీవేంకటేశ్వరుఁడ నన్ను నీవు
సీలాన నీ వాఁడనైతిఁ జెప్పనేది నాకు