పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0279-06 లలిత సం: 03-458 అధ్యాత్మ


పల్లవి :

అంతర్యామీ వో అంతర్యామీ
బంతి నాకేమిగల్లా నా పాలివాఁడవు గావా


చ. 1:

దొంతులై అన్ని యోనులాఁ దొల్లి నేఁ బుట్టేటినాఁడే
అంతరాత్మవైనవాఁడ వటు నీవేకా
ఇంతట విడిచేవా నన్నింద్రియాలఁ గట్టివేసి
పొంతఁ జూచేవిటు నాకుఁ బొత్తులకాఁపవుగా


చ. 1:

తొడరి స్వర్గనరక దుఃఖసుఖములనాఁడు
అడరి కర్మసాక్షివటు నీవేకా
విడువ వెప్పుడు నన్ను విషయాలఁ జిక్కినాఁడ
కడ నూరకుండనేల కన్నవాఁడవు గావా


చ. 1:

నీ చేతఁగానిది లేదు నీవు నాకుఁ బ్రాణమవు
కాచుటకు నీకంటే నొక్కరు వచ్చేరా
చేచేత శ్రీవేంకటేశ చేరి నీకు శరణంటి
యేచి నన్ను మన్నించితివిది నీ తేజముగాదా