పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0279-04 సామంతం సం: 03-456 భక్తి


పల్లవి :

గరిమల నెరఁగరుఁ గాక మానవులు
సిరులఁ దియ్యని నోరఁ జేఁదు మేసేదా


చ. 1:

హరినారాయణ యనియెడి నోరను
ధర నితరుల పేళ్లు దడవుటెట్టు
సరవితో వేదములు చదివేటి నోరను
పరులమీఁది పదాలు పాడేదా


చ. 2:

మునుప శ్రీపతికి మ్రొక్కిన చేతుల
అనరుహులకు దండమనుట యెట్టు
మునుకొని పూవులు ముడిచిన సిరసున
కనలి కట్టెలు మోచి కాకయ్యేదా


చ. 3:

బలిమి శ్రీవేంకటపతిఁ గొలిచినవారు
తెలియ కల్పులఁ గొల్పి తిరుగుటెట్లు
జలధి దాఁటేవాఁడు సరి నోడ వుండఁగ
వలవని జోలితో వదరు వట్టేదా