పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0279-03 దేవగాంధారి సం: 03-455 శరణాగతి


పల్లవి :

ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక
పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా


చ. 1:

నాలికె వొక్కటే నీ నామము లనంతము
పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా
వోలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు
పోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యా


చ. 2:

వట్ట నా చేతులు రెండే పదములు నీకుఁ బెక్కు
వొట్టి నిన్నుఁ బూజించ నోపికేదయ్యా
గట్టి నాచెవు లిసుమంత కథలు నీకవియెన్నో
పట్టపు నేనెట్టు విని భజియించేనయ్యా


చ. 3:

యేమిటాఁ జిక్కవు నీవు యింత దేవుఁడవుగాన
కామించి నీడాగు మోచి గతిగ నేను
యీ మేర శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గావు
దీమసాన నిఁక వేరేతెరువు లేదయ్యా