పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0279-02 బౌళి సం: 03-454 అధ్యాత్మ


పల్లవి :

వద్దిక నోపము వట్టి స్వతంత్రము
వొద్దిక శాంతితో నుండేమయ్యా


చ. 1:

నడవక మానవు నానాజగములు
కడఁగిన హరిసంకల్పానను
వుడుగ కిందు నా వుద్యోగమేఁటిది
నడుమనే కనుఁగొని నవ్వేమయ్యా


చ. 2:

కలుగక మానదు కాఁగల భోగము
కలిమిఁ బురాకృత కర్మమిది
అలసి యిందు నా యాస లేమిటికి
కలిగిన పాటే కానీవయ్యా


చ. 3:

తగులక మానదు తన సంసారము
వెగటగు మాయావిలాసము
అగపడి శ్రీవేంకటాధిపు కృపచే
తగిన పాటినే తనిసేమయ్యా