పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0278-06 గుండక్రియ సం 03-452 వైష్ణవ భక్తి


పల్లవి :

ఏ పాటి తన కర్మ మాపాటి కాపాటె
శ్రీపతిదాసుఁ డయితే చిహ్న లిటువలెఁ బో


చ. 1:

అందరిని నిర్మలులే యని తలఁచిన తన-
నింద లేని మనసే నిర్మలము
మందలించి లోకులతో మంచి మాఁట లాడితేను
బందెలేని తన నోరే భావించ మంచిది.


చ. 2:

అంతటాను హరి యున్నాఁడని చూచినఁ దన -
యంతరంగమున నుండు నీ దేవుఁడే
చింతించి యీ జగము చేకొని పావనమంటే
పంతపు తన దేహముఁ బరమపావనమే


చ. 3:

పుట్టితేఁ దన పాలికిఁ బుట్టే నీ ప్రపంచము
దట్టమైన పుట్టెల్లఁ దనతోడిదే
యిట్టే శ్రీవేంకటేశుఁ డిచ్చినాఁడీ గుణము
పట్టమై నావద్దనుండు పరమవిజ్ఞానము