పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0278-05 సాళంగం సం: 03-451 శరణాగతి


పల్లవి :

నీకుఁ దొల్లే యలవాటు నిరుహేతుకపుదయ
జోక నురుత మెచ్చిన సులభఁడవేకా


చ. 1:

నేరములు దొలఁగించ నెలవులు గలిగించ
గారవించ హరి నీవే కలవు నాకు
నా పేరఁ బిలిచితే నారాయణ యనెనంటా
చేరి కాచినటువంటి శ్రీపతివిగా


చ. 2:

దురితము లణఁగించ దుఃఖములు పెడఁబాప
గరిమఁ గేశవ నీవే కలవు నాకు
మరమరా యంటేను మరి రామ యనెనంటా
తిరముగఁ గాచి నట్టి దేవుఁడవుగా


చ. 3:

వినుతులు చేకొని వేడుకతో నన్నుఁ గావ
ఘనుఁడ శ్రీవేంకటేశ కలవు నాకు
మనసునఁ దలఁచితే మాటలఁ బిలిచెనంటా
తనిసి కంభాన వెళ్లే దైవమవుగా