పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0278-04 శుద్ధవసంతం సం: 03-450 వైష్ణవ భక్తి


పల్లవి :

ఎందు వెదకనేల యే ప్రయాసాలు నేల
యిందే వున్నది బ్రదు కిహపరములకు


చ. 1:

ముక్కోటి తీర్థములు ముకుందుదాసుల-
వొక్కపాదాంగుటమున నొలికీనిదే
మిక్కిలి జపతపాలు మించిన ప్రపన్నుల-
చిక్కని కృపాకటాక్షసీమ నున్నదిదివో


చ. 2:

చేసేటి పుణ్యఫలాలు శ్రీవైష్ణవులచేత
రాసులై యిరుదెసల రాలీనివే
ఆసల విజ్ఞానార్థ మదివో ప్రపన్నుల-
భాసురపుఁ బెదవులఁ బాఁతి పైపై నున్నది


చ. 3:

సకలదేవతలచే సాధించే వరములు
మొకరి తదియ్యులమూఁక నిదివో
వెకలి శ్రీవేంకటాద్రివిభుని మహిమలెల్లా
ప్రకటించి వీరి సల్లాపాన నున్నదిదివో