పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0274-02 లలిత సం: 03-425 అంత్యప్రాస


పల్లవి :

ఇన్నిటా శ్రీహరిభక్తి యిది లాభము
పన్నిన తపముచేత బడలుటే లాభము


చ. 1:

యెనయఁ గర్మదేహ మిదెన్ని పాట్లు వచ్చినా
ననుభవించి తీరుచు టది లాభము
తన పాపవర్తన యితరు లెంత నిందించినా
ననుమానించక పడుటది లాభము


చ. 2:

తగు సంసారజీవుఁడు తన్నెంత వేసరించినా
నగి రుణము దీర్చుట నానా లాభము
చిగురువంటి చిత్తము చేరి యెందు చెప్పినాను
తగిలి యలయుటే దక్కినట్టి లాభము


చ. 3:

శ్రీవేంకటేశ్వరుఁడు జీవములో నుండఁగాను
యేవేళ నెట్లయినా నివి లాభము
పావనమైనట్టి యాత్మభావమెంత మఱచినా
ఆవల నానందించుటది లాభము