పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0274-01 మంగళ కౌశిక సం: 03-424 మాయ


పల్లవి :

విడువవో మాయా విష్ణువధీనము
వొడలిది నీ కెందు నునికే లేదు


చ. 1:

శ్రీపతినామము చేకొనే నాలుక
యే పాపములకు నెడలేదు
దాపగు గోవిందుఁ దలఁచిన మనసిది
కోపముల కిరవుకొన నెడలేదు


చ. 2:

నెలవుగ హరికథ నిండెను వీనుల
కలిదోషము లిక్కడ లేవు
అలరిన జన్మం బచ్యుతు శరణని
నిలిచె దుఃఖముల నివారణము


చ. 3:

శ్రీవేంకటపతిఁ జేరె నాత్మ యిది
భావవికారము పని లేదు
దైవాధీనము తత్త్వవిచారము
వేవేలు కర్మపువిధులే లేవు