పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0273-06 మంగళకౌశిక సం: 03-423 శరణాగతి


పల్లవి :

నేమెంత మూఢులమైనా నీలవర్ణుఁ డంతరాత్మ
మా మనసు వెలితేల మంచిదౌఁ గాక


చ. 1:

దైవము కృప గలితే తన కర్మా లడ్డమా
ఆవేళ ఘనపుణ్యుఁడౌఁ గాక
గోవిందుఁడు మన్నించితేఁ గొంచము దొడ్డున్నదా
కోవరపు సిరులంది కొన కెక్కుఁగాక


చ. 2:

పరమాత్ముఁ డేలుకొంటే బంధములు గలవా
తెరదీసినట్లనె తెగుఁ గాక
హరి విజ్ఞానమిచ్చితే నడ్డము మాయలుండునా
తొరలి జీవుఁడు మాయఁ దొలఁగుఁ గాక


చ. 3:

శ్రీవేంకటేశ్వరు రూపు చిత్తములోఁ జిక్కితేను
చావుఁబుట్టుగు లున్నవా జయమౌఁ గాక
కైవల్య మీతఁ డిచ్చితేఁ గడమలు గలవా
కేవలపు జగమెల్లా గెలుపించుఁ గాక