పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0273-05 నారాయణి సం: 03-422 శరణాగతి


పల్లవి :

దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో
శ్రీవిభుఁడ నీవే కాదా చిత్తములోనయ్యా


చ. 1:

దివములు సరియే దినరాత్రులును సరే
యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా
భవములు సరియే ప్రాణములు సరియే
భువిఁ బుణ్యపాపముల భోగము వేరేలయ్యా


చ. 2:

వినికిందరి కొకటే విషయాలు నొకరీతే
మునిఁగేటి జాతిభేదము లివేలయ్యా
అనయముఁ జూపొక్కటే ఆఁకలియు నొకటే
పెనఁగేటి గుణముల పెక్కుజాడ లేలయ్యా


చ. 3:

అంతరాత్మ నీ వొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ
చింతలు వేవేలైన సిలుగేలయ్యా
యింత సేసీ నీ మాయ లిందుకే నీ శరణంటే
కాంతుఁడ న న్నిందుకే కాచితివి నేఁడయ్యా