పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0273-04 శంకరాభరణం సం: 03-421హనుమ


పల్లవి :

శరణు కపీశ్వర శరణం బనిలజ
సరవి నెంచ నీ సరి యిఁక వేరీ


చ. 1:

పుట్టినవాఁడే భువనము లెరఁగఁగ
పట్టితి సూర్యునిఁ బండనుచు
ముట్టిన చుక్కలు మోవఁగఁ బెరిగితి
విట్టిప్రతాపివి యెదురేదయ్యా


చ. 2:

అంపిన యప్పుడే యంబుధి దాఁటితి-
వింపులు సీతకు నిచ్చితివి
సంపద మెరయుచు సంజీవి దెచ్చితి
పెంపును సొంపునుఁ బేర్కొన వశమా


చ. 3:

బెదరక నేఁడే శ్రీవేంకటగిరిఁ
గదిసి రాముకృప గైకొంటి
వదలక నీ కృపవాఁడనైతినిదె
యెదుటనే కాచితివిఁకఁ గడమేమీ