పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0273-03 బౌళిరామక్రియ సం: 03-420 నృసింహ


పల్లవి :

అభయదాయకుఁడ వదె నీవే గతి
యిభరక్షక నను నిపుడు గావవే


చ. 1:

భయహర దైతేయభంజన కేశవ
జయ జయ నృసింహ సర్వేశ్వరా
నియతము మా కిదె నీ పాదములే గతి
క్రియగా మమ్మేలి కింక లుడుపవే


చ. 2:

బంధవిమోచన పాపవినాశన
సింధురవర దాశ్రితరక్ష
కంధరవర్ణుఁడ గతి నీ నామమె
అంధకారముల నణఁచి మనుపవే


చ. 3:

దైవశిఖామణి తత చక్రాయుధ
శ్రీవేంకటగిరి శ్రీరమణా
సావధాన నీ శరణ్యమే గతి
వేవేలకు నావిన్నప మిదియే