పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0273-02 సాళంగం సం: 03-419 రామ


పల్లవి :

కొలిచినవారల కొంగు పైఁడితఁడు
బలిమిఁ దారకబ్రహ్మ మీతఁడు


చ. 1:

యినవంశాంబుధి నెగసిన తేజము
ఘనయజ్ఞంబులఁ గల ఫలము
మనుజరూపమున మనియెడి బ్రహ్మము
నినుపుల రఘుకులనిధాన మితఁడు


చ. 1:

పరమాన్నము లోపలి సారపుఁజవి
పరగిన దివిజుల భయహరము
మరిగిన సీతామంగళ సూత్రము
ధరలో రామావతారం బితఁడు


చ. 1:

చకిత దానవుల సంహారచక్రము
సకల వనచరుల జయకరము
వికసితమగు శ్రీవేంకటనిలయము
ప్రకటిత దశరథభాగ్యం బితఁడు