పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0274-03 లలిత సం: 03-426 అధ్యాత్మ


పల్లవి :

మనసొకటి కోరికలు మాలు గలపుచు(?)నుండు
తనిసితే నదియ పరతత్త్వమై నిలుచు


చ. 1:

కన్నులనియెడి పాపకర్మంబు లివి రెండు
పన్ని తామెన్నింటి పైపైనఁ బారు
మున్నె యివి హరిపాదముల మీఁద నిలిపినను
అన్ని పుణ్యంబులను అందునే కలుగు


చ. 2:

వీనులనియెడి మహావెడఘోర నరకములు
అన్ని పరనిందలే ఆలింపుచుండు
నానాట యిందులో నారాయణుని కథలు
వూని నించిన పుణ్యభోగములే యొసఁగు


చ. 3:

నాలుకనియెడి గుహను నాచుఁబామది యొకటీ
గాలి అమృతపు విషము గ్రక్కుచుండు
యీ లీల శ్రీవేంకటేశు నామామృతము
సోలి నించవే ఆత్మ శుభములే కలుగు