పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0272-06 లలిత సం: 03-417 శరణాగతి


పల్లవి :

నిలిచిన చోటనెల్లా నిధాన మీతఁడు
యిల వెఱవ వెఱవ నేమిటీకి నిఁకను


చ. 1:

హరి నాకుఁ గలఁడుగా అన్నిటిఁ బరిహరించ
నిరతి గర్మములెంత నిండుకుండినా
దరిదాపు ఇతఁడేకా తగ వెనుక వేసుకో
విరవిరఁ బాపాలు నా వెంటఁ బడినాను


చ. 2:

గోవిందుఁడు గలఁడుగా కొంకు దీర్చి ననుఁ గావ
కావరపు భవములు గదిమినాను
దేవుఁడితఁ డున్నాఁడుగా దిక్కుదెపై నిలుపఁగా
భావపు సంసారవార్ధి పైకొని ముంచినను


చ. 3:

శ్రీవేంకటేశుఁడే చిత్తగించి నన్నేలెఁగా
వావాత నింద్రియాలు వళకాడినా
యీవల నావల నితఁ డిహపరా లిచ్చెఁగా
వావిరి నే దాస్యగర్వముతో నుండినను