పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0272-05 లలిత సం: 03-416 విష్ణు కీర్తనం


పల్లవి :

బహుకుటుంబివి నీవు బ్రతుకఁగ వెరవేదో
విహగగమన నాకు వెరగయ్యీ నిందుకే


చ. 1:

పుట్టేటి జంతువులు భువనములెల్లా నిండె
ఇట్టి బ్రహ్మాండకోట్లు ఇన్నియు నీ మేన నిండె
ఇట్టె ఇందరి రక్షించే యితవైన విధమేదో
వొట్టుగ కాఁపురము నీ వుండఁగఁ జోటేదో


చ. 2:

చిన్నిచిన్ని దేవతల చేఁతల ముద్దులు నిండె
కన్నుల నీకివి చూచి కడు సంతసాలు నిండె
మన్ననలు వీరికిచ్చి మలపేటి విధ మేదో
వున్నతి నీ చింతదీరి వుండుటిఁక నెన్నఁడో


చ. 3:

నీ దేవియైన లక్ష్మి నిచ్చ సంపదలు నిండె
ఆదియై శ్రీవేంకటేశ ఆకె నీ వురాన నిండె
పోదియై నీవివియెల్లా భోగించేదేపొద్దో
నీదాసులము నేము నినుఁ జింతించితిమి