పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0272-02 ముఖారి సం: 03-413 వైష్ణవ భక్తి


పల్లవి :

విష్ణుఁడ వచ్యుతుఁడవు విశ్వపరిపూర్ణుఁడని
వైష్ణవు లానతియ్యఁగా వట్టి చదువులేల


చ. 1:

వెన్న చేతఁబట్టి నేయి వెదకఁగ నిఁకనేల
నిన్ను లోన నించుకొని నిజమేదో యననేల
వున్నతి దీపమువట్టి వొగి నూతఁబడనేల
పన్ని నీ దాస్యము గల్గ బహుకర్మమేల


చ. 2:

చాలాధనము గల్గి సంతలఁ దిరియనేల
నాలుక నీ పేరు గల్గ నానాజపములేల
కాలము నేరు గుడిచి కాలువ వొగడనేల
పాలించ నీ వుండఁగాను పరచింతలేల


చ. 3:

మిన్ను చూచేయందుకుఁగా మిక్కిలి తోదోపు లేల
అన్నిటా నీవుండఁగాను అడుగనేల
యెన్నఁగ శ్రీవేంకటేశ యిందరి నేలేవు నీవే
నిన్నే కొలుచుటఁ గాక నీటుగర్వాలేల