పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0272-01 దేసాక్షి సం: 03-412 వైష్ణవ భక్తి


పల్లవి :

కలవి రెండే భూమి కామనిధానంబులు
జలజాక్షుఁడు నతని శరణాగతియును


చ. 1:

నరులు లేరా భూమి నానాదిక్కులలోన
హరిదాసుఁడొక్కఁడే యరుదుఁ గాక
సురలు లేరా మింట సోదించ ఘనుఁ డొక్కఁడే
పరమపదమేలు శ్రీపతియే కాక


చ. 2:

మాటలు లేవా భూమి మంత్రము లెంచి చూడఁగ
తేటల హరినామమే తేఁకువఁ గాక
కోటిపూజ లిల లేవా కుమతులు సేసేవి
పాటల ప్రపన్నుని భక్తి దొడ్డుఁ గాక


చ. 3:

విహితసుఖము లేదా విశ్వములో భోగించ
సహజమోక్షసుఖమే సారముఁ గాక
యిహమున శ్రీవేంకటేశుఁ డిందరికి లేఁడా
మహి శ్రీవైష్ణవులకే మనికాయఁ గాక