పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0271-06 రామక్రియ సం: 03-411 విష్ణు కీర్తనం


పల్లవి :

ఇంతటి దైవము లేఁడు యెందుఁ జెప్పి చూపఁగ
వంతులకుఁ గొలిచేటివారి భాగ్య మిఁకను


చ. 1:

గక్కన మన్మథునిఁ గన్నతండ్రి గనక
యెక్కువ చక్కఁదనాల కితఁడే దొడ్డ
నిక్కపు సూర్యచంద్రాగ్నినేత్రుఁడు గనక
దిక్కులఁ గాంతుల నీ దేవుఁడే దొడ్డ


చ. 2:

అంచెల లక్ష్మికి మగఁడై నాఁడు గనక
యెంచ రాని సంపదల కితఁడే దొడ్డ
పంచినచోటఁ జక్రము పంపు చేసీఁ గనక
మించిన ప్రతాపాన మిక్కిలిని దొడ్డ


చ. 3:

దైవికపుఁ బురుషోత్తముఁ డితఁడు గనక
దేవతల కెల్లా నీ దేవుఁడే దొడ్డ
వావాత శ్రీవేంకటాద్రి వరములిచ్చీఁ గనక
యేవల దాతలలోన నితఁడే దొడ్డ