పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0271-05 ఆహిరి సం: 03-410 శరణాగతి


పల్లవి :

నీకే శరణంటి నిన్నే నమ్మితినయ్య
పైకొని శ్రీహరి నీవే పరిహరించవే


చ. 1:

విజ్ఞానములు గొన్ని విందు నే నూరకే
సుజ్ఞానములు గొన్ని చూతు నే నేపొద్దు
అజ్ఞానము నే ననిశము నడచేది
ప్రజ్ఞాహీనుఁడ నెంత పాపకర్మమో


చ. 2:

సుకృతము లోకమరి సొరిది నే బోధింతు
ప్రకృతి యొక్కొక వేళ భావింతు నాత్మలో
అకృతములే నే ననిశముఁ జేసేది
వికృతాచారుఁడ నింకా వికార మెంతో


చ. 3:

ధర్మమార్గమూఁ గొంత తలఁపున నెరిఁగితి
నిర్మలచిత్తమై మోక్షనిలయము నెరిఁగితి
నిర్మించి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలఁగాను
మర్మ మెరిఁగితి నెట్ల మన్ననఁ గాచితివో