పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0271-04 భైరవి సం: 03-409 తిరుపతి క్షేత్రం


పల్లవి :

విశ్వరూప మిదివో విష్ణురూప మిదివో
శాశ్వతులమైతి మింక జయము మా జన్మము


చ. 1:

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు
మెండుగఁ బ్రత్యక్షమాయ మేలువో నా జన్మము


చ. 2:

మేడవంటి హరిరూపు మించైన పైఁడి గోపుర -
మాడనే వాలిన పక్షు లమరులు
వాడలఁ గోనేటిచుట్ల వైకుంఠనగరము
యీడ మాకుఁ బొడచూపె ఇహమేపో పరము


చ. 3:

కోటి మదనులవంటి గుడిలో చక్కని మూర్తి
యీటు లేని శ్రీవేంకటేశుఁడితఁడు
వాఁటపు సొమ్ములు ముద్ర వక్షపు టలమేల్మంగ
కూటువై నన్నేలితి యెక్కువవో నాతపము