పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0272-03 వరాళి సం: 03-414 అంత్యప్రాస


పల్లవి :

చంచలము మానితేను సంసారమే సుఖము
పొంచి హరిదాసుఁడైతే భూమెల్లా సుఖము


చ. 1:

వొరుల వేఁడకవుంటే వున్నచోనే సుఖము
పరనింద విడిచితే భావమెల్లా సుఖము
సరవిఁ గోపిఁచకుంటే జన్మ మెల్లా సుఖమే
హరిఁ గొలిచినవారి కన్నిటాను సుఖమే


చ. 2:

కాని పని సేయకుంటే కాయమే సుఖము
మౌనమున నుండితేను మరులైనా సుఖము
దీనత విడిచితేను దినములెల్లా సుఖము
ఆని హరిఁ దలఁచితే నంతటా సుఖమే


చ. 3:

చలము విడిచితేను సంతతము సుఖము
యిల నాసలుడిగితే నిహమెల్లా సుఖమే
తలఁగి శ్రీవేంకటేశు దాసులైనవారు వీని
గెలిచి నటించఁగాను కిందా మీఁదా సుఖమే