పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0270-05 మాళవిగౌళ సం: 03-405 శరణాగతి


పల్లవి :

రుచులు నే నిటు గొనని వేడవి రోఁతలయ్యెడిఁగాక నేఁడు
వచనముల హరి నీకు శరణని వసుధఁ బావనమైతిఁ గాక


చ. 1:

నేను సేయని పాపమేడది నిఖిలలోకములందును
నేను చొరని నరకమేడది నెఱయ దుర్గతుల
నేను పొడమని యోనులేడవి నిఖిలజంతువులందును
పూని హరి నిను శరణుచొరఁగాఁ బుణ్యుఁగాఁ జేసితివిఁ గాక


చ. 2:

నిరతి వాడని కల్లలేడవి నేను నాలుక తుదలయందును
పొరలి నడపని కర్మమేడది భువి ననాచారములలో
తిరిగి తిరిగి నీచులిండ్లను తిరియనర్థము లింకనేడవి
గరిమ హరి నే నిన్ను శరణనఁగాను ఘనుఁ జేసితివిఁ గాక


చ. 3:

తలఁప నజ్ఞానములు నపరాధములు నాయెడ లేనివేడవి
యెలిమి నన్నిట్లేలఁ దగునా యేలితివిఁ గాక
నిలిచి శ్రీవేంకటగిరీశ్వర నీకు శరణనుమాత్ర మింతే
కలసి నాయెడనేమి గంటివి కాచితివి భువనములలోను