పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0270-04 దేవగాంధారి సం: 03-404 మనసా


పల్లవి :

మాయలఁ బొరలఁగనేఁటికి మనసా కలకాలంబును
యేయెడ లక్ష్మీకాంతుఁ డీతనిఁ దలఁచవుగా


చ. 1:

మన్నునఁ బుట్టిన కాయము మన్నుననఁగేటి దింతే
మిన్నుల మీఁదికిఁ బోవదు మెరయుచు నెంతైనా
అన్నిట నీ జీవునికిని అంతర్యామీ దేవుఁడు
యెన్నఁడుఁ బాయని బంధువుఁ డీతనిఁ దలఁచవుగా


చ. 2:

ధరపైఁ బుట్టిన దేహము ధరపైఁ బుట్టి(ట్టు?)న దింతే
పరమానందము గోరదు పైపై నెంతయినా
గరిమల నీ జీవునికిని గతియగు దేవుం డీతఁడు
నిరతపు సుఖములె యొసఁగును నీవిటు దలఁచవుగా


చ. 3:

శ్రీవేంకటపతి సొమ్ములు చేరెడి దాతని నింతే
ఆవల నితరుల నంటవు ఆతుమ లన్నియును
యేవిధముల నీ జీవుని కేలికె యీదేవుండే
పావనముగ బ్రదికించెను పయికొని తలఁచవుగా